ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట, సెప్టెంబర్ 20: ఇటీవల జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం గురుకులంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి పాముకాటుకు గురికావడం ఘటనలు మరువకముందే.. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి బీసీ హాస్టల్లో మరో విద్యార్థిని పాము కాటేసింది.
ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రమావత్ చంద్రూనాయక్-రజిత దంపతుల కుమారుడు రోహిత్ (12) ఇటీవల ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలోని బీసీ హాస్టల్లో చేరాడు. అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం హాస్టల్ రూం లో ఉండగా పాము కాటేయడంతో అరుస్తూ బయటికి పరుగులు తీశాడు. దవాఖానకు తీసుకెళ్లగా క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. పామును హాస్టల్ సిబ్బంది చంపేశారు.