హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): వేలి ముద్రలను తయారుచేసి ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసు ద్వారా నగదును కాజేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వేలి ముద్రల కోసం ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్ నుంచి సేల్ డీడ్లను డౌన్లోడ్ చేసుకొని, అందులోంచి వేలి ముద్రల నెగెటివ్‌లు సేకరించి ఏకంగా 10 వేల వేలి ముద్రలను తయారు చేశారు. అనుమానాస్పద లావాదేవీలపై సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందటంతో దర్యాప్తు చేపట్టి ఏడుగురికి పట్టుకొన్నారు. ముఠాలో ప్రధాన సూత్రధారి.. ఏపీలోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్‌గా పనిచేసిన ఉద్యోగి కావటం గమనార్హం. గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన నల్లగల్ల వెంకటేశ్వర్లు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో డీటీపీ అపరేటర్‌గా పని చేశాడు. ఆ సమయంలో ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ సేల్ డీడ్లను డౌన్లోడ్ చేసుకోవటం సులభమని తెలుసుకొన్నాడు.
ఆ తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసు కింద నగదును పొందుతున్న విధానంపై అవగాహన పెంచుకొన్నాడు. తన స్నేహితులు మెగావత్ శంకర్ నాయక్, రత్నం శ్రీనివాస్, దర్శనం సామేలు, చల్లా మణికంఠ, షేక్ ఖాసీం, విశ్వనాథుల్లా అనిల్ కుమార్‌తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. ముందుగా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్ నుంచి రోజుకు 200 సేల్ డీడ్లను డౌన్లోడ్ చేశాడు. ఆ సేల్ డీడ్‌లో ఉండే ఆధార్ నెంబర్, వేలి ముద్రలను సేకరించాడు. సేకరించిన వాటిని ఎక్స్‌రే షీటుతో నెగెటివ్‌గా మార్చి, పాలిమర్ లిక్విడ్ ద్వారా అచ్చం తోలు పోలిన వేలి ముద్రగా మార్చాడు. ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ కోసం యస్ బ్యాంక్-రాయ్‌నెట్ ద్వారా ఈ-పాయింట్ ఏజెన్సీ తీసుకొన్నాడు.
వేలి ముద్రలను స్నేహితులకు అప్పగించి.. బయోమెట్రిక్ ద్వారా బ్యాంక్ ఖాతాల్లోని నగదును కొల్లగొట్టాడు. ఇటీవల 149 ఖాతాల్లోంచి దాదాపు రూ.34 లక్షలు డ్రా చేయటంతో రాయ్నెట్కు ఫిర్యాదులు అందాయి. అసలేం జరిగిందని ఆరా తీయగా, వెంకటేశ్వర్లు ఈ-పాయింట్ నుంచే నగదు విత్ డ్రా అయినట్టు తేలింది. ఈ-పాయింట్ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. గుట్టు రట్టయ్యింది. రెండున్నరేండ్లుగా వెంకటేశ్వర్లు ఈ చీటింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరోసారి ముఠాను కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టనున్నారు. అటు.. ఏపీ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని పోలీసులు అప్రమత్తం చేశారు. బాధితులంతా ఏపీకి చెందినవారేనని సీపీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసుల బృందాన్ని సీపీ అభినందించి రివార్డు అందజేశారు.