Free Bus For Women | చొప్పదండి, జూన్12: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలికి, కండక్టర్‌కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వస్తున్న బస్సు మహిళలతో కిక్కిరిసిపోయింది. మార్గమధ్యంలో చొప్పదండి బస్‌స్టేషన్‌లో బస్సు ఆపగా.. మరికొందరు మహిళలు బస్సు ఎక్కారు. బస్సు మెట్లపై ఎవరూ ఉండొద్దని, లోపలికి రావాలని కండక్టర్ పిలువగా.. అందులోని ఓ ప్రయాణికురాలు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది.
ఆ ప్రయాణికురాలు ఎంతకూ వినకపోవడంతో డ్రైవర్ బస్సును ఆపారు. ఈ క్రమంలో గొడవ పెద్దదై.. పంచాయితీ చొప్పదండి ఠాణాకు చేరింది. పోలీస్ సిబ్బంది వారితో మాట్లాడి గొడవను పరిష్కరించారు. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ఫ్రీ బస్సు పథకంతో.. బస్సుల్లో సీట్లే లేకుండా పోయాయని, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ప్రయాణికులు మండిపడ్డారు. బస్సులు సరైన సమయానికి రావడం లేదని, వచ్చినా కిక్కిరిసిపోవాల్సి వస్తున్నదని, వెంటనే బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.