Sangareddy | గుమ్మడిదల, ఫిబ్రవరి 12: ఓ తండ్రి రెండేండ్ల కొడుకును లక్ష రూపాయలకు అమ్ముకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఆశిక్ తులసీరామ్ హట్వార్, మాధురి ఇకర్ దంపతులు. వీరు కొన్ని నెలలుగా దోమడుగులో నివసిస్తున్నారు. వీరికి రెండేండ్ల కుమారుడు నాక్ష్ ఉన్నాడు.
ఆశిక్ తులిసీరామ్ తన కుమారుడిని అల్లాదుర్గం, గడిపెద్దాపూర్ గ్రామాలకు చెందిన శేరివిఠల్, రాజేశ్వరి సహకారంతో నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన ముస్తిస్వామి, కల్పనకు లక్ష రూపాయలకు విక్రయించారు. ఈ దంపతులు ప్రస్తుతం దోమడుగులోనే నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న అతడి భార్య మాధురి ఇకర్ సోమవారం గుమ్మడిదల పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఎట్టకేలకు తన కొడుకును వాపస్ తెచ్చుకున్నది. తులసీరాంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు.