Tomato | కౌడిపల్లి, జూలై 22 : టమాట సాగు చేసిన ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు. ప్రస్తుతం టమాట ధర చుక్కలను తాకుతుండటం.. ఈయన సాగు చేసిన పంట చేతికి రావడం కలిసొచ్చింది. ఇప్పటివరకు రూ.1.84 కోట్ల లాభం ఆర్జించాడు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్‌కు చెందిన రైతు మహిపాల్‌రెడ్డి. ఈయన 8 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. పంట చేతికి రావడంతో రోజూ 250 బాక్సులు అమ్ముతున్నాడు. వేసవిలో టమాట పం డించాలన్న తపన ఆయనలో ఉండేది.
వేసవిలో ఇతర రాష్ట్రాల నుంచి టమాట ఎందుకు దిగుమతి చేసుకోవాలి? తెలంగాణలోనూ ఏప్రిల్, మే నెలల్లో పండించాలనే పట్టుదలతో సాగుచేశాడు. ఇందుకోసం ఆయన దాదాపు రూ.30 లక్షలకుపైనే పెట్టుబడి పెట్టాడు. టమాట నాణ్యత ఉండటంతో వ్యాపారులు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఈయన ఇప్పటికే రూ.1.84 కోట్ల విలువైన టమాట అమ్మగా.. ఇంకా రూ.1.80 కోట్ల పంట మిగిలి ఉన్నది. రేటు తగ్గినా కూడా కోటి రూపాయల పంట వస్తుందని రైతు చెప్తున్నాడు. ఖాత బాగా ఉండటంతో రోజూ డీసీఎం, ట్రక్కుల్లో మార్కెట్‌కు తరలిస్తున్నాడు.