Tomato | పరిగి, జూలై 25: కూరగాయలు సాగు చేసే రైతులకు ఎప్పుడు చూసినా ధరలు లేక అరకొర ఆదాయం వచ్చేది. గతంలో రూపాయికి కిలో టమాటలు విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్నిసార్లు కూలి డబ్బులు కూడా రాకపోతే.. రోడ్లపై పారబోసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అలాంటిది ఈసారి టమాటలకు మంచి ధర రావడంతో ఓ రైతు కోటీశ్వరుడు కాబోతున్నాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామానికి చెందిన ఏ నర్సింహారెడ్డి స్వంత పొలం 4 ఎకరాలు, దోమ మండలం పాలేపల్లిలో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని ఏటా కూరగాయలు సాగు చేస్తారు. ఈసారి కూడా 10 ఎకరాలలో టమాట పంట సాగు చేశాడు.
మల్చింగ్ విధానంతోపాటు డ్రిప్ సిస్టమ్లో పంట సాగు చేయడంతో మంచి దిగుబడి వచ్చింది. నెల రోజుల నుంచి టమాట పంట చేతికి అందడంతోపాటు క్రమంగా ధర పెరగడం వల్ల రైతు నర్సింహారెడ్డి పంట పండింది. ఇప్పటివరకు సుమారు 2,500 పైచిలుకు బాక్సుల టమాటాలు విక్రయించానని, ప్రస్తుతం ఒక బాక్సు టమాట ధర రూ.2,000 నుంచి రూ.2,500 వరకు పలుకుతున్నదని రైతు తెలిపాడు. ఇలా టమాటాల విక్రయం ద్వారా సుమారు రూ.30 లక్షలు పైగానే ఆదాయం వచ్చినట్టు నర్సింహారెడ్డి పేర్కొంటున్నాడు. ఇప్పటికి 30 శాతం పంటను విక్రయించగా 70 శాతం పంట పొలంలోనే ఉన్నది. మరో నెల రోజులలో మిగతా పంటను సైతం విక్రయించనున్నట్టు తెలిపాడు. టమాటా ధర ఇలాగే కొనసాగితే.. పంట పూర్తయ్యే వరకు రైతు నర్సింహారెడ్డికి సుమారు కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. ఉత్తమ రైతుగా ఎంపికైన నర్సింహారెడ్డిని రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ అభినందించారు.
పంట దిగుబడి, మంచి ధరతో ఆదాయం
ఏటా నా పొలంలో కూరగాయలు సాగు చేస్తాను. ఈసారి 10 ఎకరాలలో టమాట సాగు చేయగా చక్కటి దిగుబడి, మంచి ధర రావడంతో ఆదాయం పెరిగింది. ఇప్పటికే సుమారు 2,500 పైగా బాక్సుల టమాటలు విక్రయించాను. సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. 70 శాతం పంట చేతికి అందాల్సి ఉన్నది. ధరలు ఇలాగే కొనసాగితే టమాటల విక్రయం ద్వారా చక్కటి ఆదాయం వస్తుంది.
-నర్సింహారెడ్డి, రైతు, సయ్యద్పల్లి,పరిగి మండలం, వికారాబాద్ జిల్లా