జనగామ చౌరస్తా, డిసెంబర్ 18: జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్‌పై ఆ పార్టీ మహిళా కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశంలో సుధాకర్ సదరు మహిళ భుజంపై చెయ్యివేసి బలవంతంగా బయటకి గెంటివేసినట్టు సమాచారం. దీనిపై ఆమె అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 354, 294(బీ) సెక్షన్ల కింద సుధాకర్‌పై ఆదివారం కేసు నమోదు చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులు కాకుండానే ఆ పార్టీ నాయకుడిపై మహిళా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.