బడంగ్‌పేట, ఆగస్టు 22: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. స్థానిక గణేశ్ చౌక్ చౌరస్తా సమీపంలోని మండి@37 రెస్టారెంట్ వద్ద గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో మోండ్రు ప్రశాంత్ (21)ను కత్తులతో దాడి చేసి చంపేశారు. మృతుడు నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం మధ్యలోనే ఆపేశాడు. గురువారం రెస్టారెంట్ ముందు పాన్‌షాపు వద్ద ఉండగా, నలుగురు వ్యక్తులు వచ్చారని, వారిలో ఒక వ్యక్తి కత్తితో ప్రశాంత్‌ను పొడిచారని పోలీసులు తెలిపారు. సిగరెట్ తీసుకొనే దగ్గర గొడవ జరిగిందని డీసీపీ సునీతారెడ్డి వెల్లడించారు. కాగా, ప్రశాంత్ హత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్ఎస్యూఐ ఎన్నికల నేపథ్యంలోనే విభేదాలు వచ్చి హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎన్ఎస్యూఐ ఎన్నికల ప్రచారంలోనూ ప్రశాంత్ పాల్గొన్నట్టు తెలిపారు. నిందితులు గంజాయి మత్తులో ఊగుతారని పేర్కొన్నారు. కాగా, నిందితులు కాంగ్రెస్ నేతలను ఆశ్రయించినట్టు సమాచారం.