మేడ్చల్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యకు అనుసంధానమైన పారా మెడికల్ కోర్సులకు మంచి భవిష్యత్తు ఉన్నదని కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో పారా మెడికల్, అలైడ్ మెడికల్ సైన్స్ కోర్సులపై విద్యార్థులు, తల్లిందండ్రులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పారా మెడికల్ కోర్సులు చేసినవారికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్నదని, డాక్టర్‌తో సమానంగా వేతనాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోనే పారా మెడికల్ కోర్సులను మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ.. మల్లారెడ్డి వర్సిటీలో వివిధ రకాలైన మెడికల్ కోర్సులను ప్రవేశపెట్టి అధునాతన వసతులతో ప్రపంచస్థాయి అధ్యాపక బృందంతో విద్య అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు.
నాణ్యమైన విద్యను అందిస్తున్నం: డైరెక్టర్ ప్రీతిరెడ్డి
తమ వర్సిటీలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి చెప్పారు. 2021-22 విద్య సంవత్సరానికి వివిధ పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అనంత్‌రావు, శ్యామల, నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ భద్రారెడ్డి యూనివర్సిటీ వీసీ డీఎన్ రెడ్డి, స్కూల్ ఆఫ్ పారా మెడికల్ డైరెక్టర్ ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.
మల్లారెడ్డి వర్సిటీలో పారా మెడికల్ కోర్సులు ప్రారంభం
మల్లారెడ్డి యూనివర్సిటీలో పారా మెడికల్ కోర్సులను ప్రారంభించారు. అనస్థీషియా, కార్డియో, డయాలిసిస్, రేడియోలాజీ, మెడికల్ ల్యాబ్, రెస్పిరేటర్ చికిత్స, క్లినికల్ రిసెర్చ్, మెడికల్ సైన్స్ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచి అందించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. పారా మెడికల్ కోర్సులకు అర్హత కలిగిన విద్యార్థులకు రూ.25 వేల రాయితీని యూనివర్సిటీ ప్రకటించింది.