Nagarkurnool | నాగర్కర్నూల్ : జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేత వాహనం బీభత్సం సృష్టించింది. సదరు నాయకుడి వాహనం ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలకపల్లి మండలం గట్టు రావిపాకుల గ్రామానికి చెందిన చటమోని రాములు (40) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అచ్చంపేట నుంచి నాగర్కర్నూల్ వైపునకు కారులో వస్తున్న బీజేపీ నేత భరత్ ప్రసాద్ వాహనం కొల్లాపూర్ చౌరస్తా వద్ద రాములు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రాములు తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మధ్య రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.