హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): పాండిచ్చేరి టెక్నోలాజికల్ యూనివర్సిటీలో 22 ఏండ్ల తెలంగాణ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బంజేరుపల్లి ముంపు గ్రామానికి చెందిన కొరిడే అనిరుధ్ శర్మ (22) యూనివర్సిటీలో బీటెక్ (సివిల్) నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ప్రస్తుతం వారి కుటుం బం అల్వాల్ కానాజీగూడలో నివసిస్తున్నది. మృతుడి తండ్రి పద్మనాభశర్మ పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విద్యార్థి అనిరుధ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి, బంధుమిత్రులు కోరారు.