ఓవైపు ప్రపంచాన్ని ‘కొవిడ్’ వణికిస్తుంటే.. ఇంట్లో తన భార్య పనికోసం పోరుపెట్టేదని వాపోయాడు వెటరన్ స్టార్ ఆర్.మాధవన్. తాజాగా, ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సరదా విషయాలను పంచుకున్నాడు. “కొవిడ్ సమయంలో షూటింగ్‌లు లేక, నేను ఇంట్లో ఉండటం చూసి.. నా భార్య సరిత నన్ను బయటికి గెంటేసినంత పనిచేసేది. నేను అలా ఖాళీగా ఉండటం నా భార్య ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఏదో ఓ పని చేస్తూనే ఉండేవాణ్ని.
అలాంటి నేను ఇంటిపట్టునే ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసిందట. అందుకే.. ఎప్పటిలానే బయటికి వెళ్లి, డబ్బులు సంపాదించుమని నన్ను పోరుపెట్టేది” అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. భార్య మాటలే తనలో ఆలోచనను రగిలించాయనీ, దాంతో తనను తాను పునఃపరిశీలించుకున్నానని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలకు విరామం ప్రకటించడంపైనా స్పందించాడు. “ఒకానొక దశలో పనిపై ఆసక్తి తగ్గింది. దాంతో కొన్నిరోజులు సినిమాలకు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నా! అందుకే, 2011 నుంచి 2015 వరకూ ఒక్క ప్రాజెక్టునూ అంగీకరించలేదు.
2016లో ‘సాలా ఖదూస్’తో తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టా!” అంటూ వెల్లడించాడు. ఆ నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉండటం వల్ల.. వ్యక్తిగతంగానేకాదు, వృత్తిపరంగానూ తిరిగి కోలుకున్నానని అంటున్నాడు. ఆ విరామం తనకు ఎంతో స్పష్టతను ఇచ్చిందనీ, కొత్త దృక్పథంతో తిరిగి రావడానికి, ఆసక్తులకు అనుగుణంగా ప్రాజెక్టులను ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చిందని చెప్పాడు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు మాధవన్. తమిళ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రంలో నెగెటివ్ పాత్రతో అలరించాడు. ఇటీవలే బాలీవుడ్ హిట్ సినిమా ధురంధర్లో ఓ కీలక పాత్రలో కనిపించాడు.