Peddapally | పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో దారుణం జరిగింది. 17 ఏండ్ల వయసున్న ఓ బాలుడిని అత్యంత దారుణంగా గొడ్డళ్లతో దాడి చేసి చంపారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ముప్పిరితోటకు చెందిన పురెళ్ల సాయికుమార్(17) తన స్నేహితులతో కలిసి గురువారం రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై గొడ్డళ్లతో దాడి చేసి చంపారు. అప్రమత్తమైన సాయికుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే సాయి కుమార్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని చంపారని సాయికుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.