Tanduru | తాండూరు, మార్చి 27 : ఆ పసిబిడ్డ జన్మించి కేవలం పది నెలలే అయింది. తల్లి ఒడిలో ఆడిపాడాల్సిన ఆ బుడ్డోడు ఆస్పత్రి పాలయ్యాడు. ఆ పసిబిడ్డ కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆ పసికందును బతికించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. కానీ ఆర్థిక కష్టాలు వెంటాడుతుండటంతో.. దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. దాతల నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన శివకుమార్, భానుప్రియ దంపతుల 10 నెలల కుమారుడు వశిష్ఠ ఉన్నాడు. అయితే ఈ పసిబిడ్డ కాలేయ వ్యాధితో భాదపడుతున్నాడు. వ్యాధి నుంచి బాలుడు కోలుకోవాలంటే కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ధారించారు. చెన్నైలోని ఆసుపత్రిలో బాలుడికి చికిత్సలు చేసేందుకు రూ.25 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. నిరుపేదలైన తల్లిదండ్రులు పసిబిడ్డను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్బీవోఎల్ సీఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆర్థిక సాయం చేయడంతో పాటు తనకు తెలిసిన వాళ్లకు ఆర్ధిక సాయం చేయాలని కోరడంతో ఇప్పటి వరకు రూ.16 లక్షలు దాతల నుంచి వచ్చినట్లు గురువారం బాధిత బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. తాండూరుకు చెందిన పర్యాద రామకృష్ణ కూడ దాతలను ప్రోత్సహించడంతో సాయం అందినట్లు తెలిపారు.
ఇంకా రూ.9 లక్షలు వైద్య చికిత్సలకు అవసరమని అందుకు తాండూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని దాతలు తమకు సాయం చేసి తన కొడుకు ప్రాణలను కాపాడాలని బాదిత బాలుడి తల్లిదండ్రులు శివకుమార్, భానుప్రియ కోరారు. ఫోన్ ఫే నంబర్ 9030268482, బ్యాంకు అకౌంట్ నంబర్ 41701602721, ఐఎఫ్‌సీ కోడ్ SBIN0020086.