హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఐసెట్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం 71,647 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో పురుషులు 33,928 మంది కాగా, అమ్మాయిలు 37,718 మంది ఉన్నారు. ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అర్హత సాధించారు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 5, 6న ఐసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఐసెట్ ఫలితాలను హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కాకతీయ వర్సిటీ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ వాకాటి కరుణ విడుదల చేశారు. ఐసెట్‌కు 86,156 దరఖాస్తులు రాగా, 77,942 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు. మొత్తం 71,647 (91.92 శాతం) మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్టు వెల్లడించారు. నిరుడుతో పోల్చితే ఐసెట్‌కు 11 వేల మంది అదనంగా హాజరైనట్టు తెలిపారు. రాష్ట్రంలో 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లు, 64 ఎంసీఏ కాలేజీల్లో 6,990 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్లు వీ వెంకటరమణ, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఐసెట్ కన్వీనర్ ఎస్ నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.