నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 15 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్లో పెండింగ్లో ఉన్న 9,378 కేసులను ఏపీకి బదిలీ చేశారు. ప్రత్యేక రాష్ర్టాలు ఏర్పడినప్పటికీ కేసులు బదిలీకాకపోవడంతో కక్షిదారులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో కక్షిదారులు, ఇతరులు సంబంధిత కేసుల వివరాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని తెలంగాణ మానవ హక్కల కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
రెండు వేర్వేరు రాష్ర్టాలుగా ఏర్పడినప్పటికీ ఈ కేసులు పెండింగ్లోనే ఉండడంతో చర్యలు చేపట్టింది. తెలంగాణ మానవ హక్కుల కోర్టు ప్రత్యేక వెబ్సైట్లో కేసుల వివరాలను పరిశీలించాలని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ను సంప్రదించాలని సూచించింది. కక్షిదారులు తదుపరి విచారణ తేదీలను, కేసుల గురించి అక్కడి అధికారులను సంప్రదించాలని తెలిపింది. ఇప్పటివరకు సదరు కేసులు పెండింగ్లో ఉండటంతో కక్షిదారులు ఇబ్బందులకు గురయ్యారని, ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టినట్టు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తెలిపింది.