దహెగాం, అక్టోబర్ 18 : తన కుమారుడిని కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంలో ఓ వ్యక్తి నిండు గర్భిణి(తన కోడలు)ని గొడ్డలితో నరికి చంపాడు. ఈ అమానవీయ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రెలో శనివారం జరిగింది. గెర్రె గ్రామానికి చెందిన శివార్ల శేఖర్ (బీసీ) అదే గ్రామానికి చెందిన తలండి శ్రావణి (ఎస్టీ)(21)ని ఏడాది క్రితం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఓ ఆలయంలో ప్రేమ పెండ్లి చేసుకుని దహెగాం పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు శేఖర్, శ్రావణి కుటుంబసభ్యులతో పాటు గ్రామపెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. శేఖర్ తండ్రి శివార్ల సత్తయ్య, కుటుంబసభ్యులు కొడుకు, కోడలిని తమ ఇంటికి రావద్దని చెప్పడంతో శేఖర్.. అత్తవారి ఇంట్లోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. శనివారం ఉదయం శేఖర్ తన మామ, అత్త, బావమరిదితో కలిసి వంట చెరుకు తేవడానికి వెళ్లాడు. ఇదే అదనుగా భా వించిన సత్తయ్య నేరుగా శ్రావణి ఇంటికి వెళ్లి ఆమెపై గొడ్డలితో దాడిచేశాడు.
ప్రాణభయంతో శ్రావణి బయటకు పరుగులు తీసినా వెంబడించి మరీ మెడ, గొం తుపై బలంగా నరికాడు. స్థానికులు అక్కడికి చేరుకునేలోపే సత్తయ్య పారిపోయాడు. అప్పటికే శ్రావణి చనిపోయింది. భర్త శేఖర్‌తో పాటు ఆమె తల్లి దండ్రులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వాహీదుద్దీన్, రూరల్ సీఐ కుమారస్వామి,తహసీల్దార్ మునవార్షరీఫ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతురాలి తండ్రి తలండి చెన్నయ్య ఫిర్యాదు మేరకు మామ శివార్ల సత్తయ్య, బావ కుమార్, తోటి కోడలు కవితపై కేసు నమోదు చేశారు. హత్యకు పాల్పడిన సత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం?