Coronavirus | హైదరాబాద్ : తెలంగాణలో కరోనా అలజడి మళ్లీ మొదలైంది. కొవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా తొమ్మిది కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు రికవరీ అయ్యారు. తాజాగా నమోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. నిలోఫర్‌లో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా, ఆ పాపకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో పదేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబడ్డ వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.