హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు పథకానికి ఆగస్టు నెలకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ రూ.875 కోట్లను మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రైతుల వ్యవసాయ మోటర్లకు విద్యుత్తు సరఫరా, పలు సాగునీటి ప్రాజెక్టులకు, జల మండలి, మిషన్ భగీరథ ప్రాజెక్టుల విద్యుత్తు బిల్లులను ట్రాన్స్‌కోకు చెల్లిస్తారు.
తెలంగాణ ఎలక్ట్రిసీటీ రెగ్యులేషన్ కమిషన్‌కు ఈ ఏడాది వార్షిక బడ్జెట్ నుంచి వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వ రూ.8.899 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో)కు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,04,65,000 విడుదల చేసింది. ఈ నిధులను వేతనాలు ఇతర పరిపాలనా పరమైన ఖర్చుల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు మంగళవారం సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.