ఖిలావరంగల్, డిసెంబర్ 24: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. 80 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.7లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన వరంగల్‌లోని శివనగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివనగర్‌కు చెందిన వ్యాపారి రాయల రవి ఈ నెల 11న కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకొని ఈ నెల 26న వరంగల్‌కు రావాల్సి ఉన్నది. ఈ క్రమంలో ఇంట్లో దొంగతనం జరిగిందని స్థానికులు, పోలీసులు ఇచ్చిన సమాచారంతో రవి తన కుటుంబ సభ్యులతో కలిసి హుటాహుటిన ఆదివారం ఇంటికి వచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి మూడు గదుల్లో ఉన్న బీరువాలను తెరిచారు. అందులో ఉన్న 80 తులాల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదు అపహరించారు. మరికొన్ని వెండి వస్తువులు కూడా కనిపించడం లేదని బాధితుడు తెలిపారు. మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.