యాచారం, జూన్ 9: గొర్రెల మందపై హైనాలు దాడి చేయడంతో 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి శివారు ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకొన్నది. స్థానికులు, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. తాటిపర్తికి చెందిన బైకని అంజయ్య, నందివనపర్తికి చెందిన అతని సోదరి పార్వతమ్మ గొర్రెలు ఒకేచోట మందలో ఉంచారు.
తాటిపర్తి అటవీ ప్రాంతంలోని హైనాలు గుంపుగా వచ్చి ఒక్కసారిగా గొర్రెల మందలపై దాడిచేశాయి. గొంతు కొరికేయడంతో గొర్రెలు చనిపోయాయి. గురువారం ఉదయం అంజయ్య మంద వద్దకు వెళ్లి చూడగా గొర్రెలు మృతిచెంది ఉండటంతో లబోదిబోమన్నాడు. విషయం తెలుసుకొన్న సర్పంచ్లు దూస రమేశ్, కంబాలపల్లి ఉదయశ్రీ, సీఐ లింగయ్య, ఫారెస్టు ఇంచార్జ్ రేంజ్ ఆఫీసర్ కమాలుద్దీన్ ఘటన స్థలాన్ని సందర్శించారు. గొర్రెల మందపై హైనాలు దాడి చేసినట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు.