హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఇఏ సిద్ధిక్ (88) గురువారం కన్నుమూశారు. సిద్ధిక్ వరి పరిశోధకుడిగా, జన్యు శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందారు. జాతీయ వ్యవసాయ శాస్త్ర అకాడమీ (ఎన్ఏఏఎస్-నాస్) ఫెలోగా కూడా గుర్తింపు పొందారు. ఆయన జాతీయ వ్యవసాయ శాస్త్ర అకాడమీ (ఎఫ్ఐఎన్ఏఏఎస్-ఫినాస్), ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ-ఇన్సా), నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్-ఇండియా (ఎఫ్ఎన్ఏఎస్సీ)ల ఫెలో షిప్‌లను పొందారు. తమిళనాడులోని శివగంగా జిల్లా లయన్గుడి గ్రామంలో 1937లో జన్మించిన సిద్ధిక్ ఎంఎస్ స్వామినాథన్ మార్గదర్శకత్వంలో సైటోజెనెటిక్స్‌లో పీహెచ్డీ పూర్తిచేశారు.
అనంతరం హైదరాబాద్‌లోని వరి పరిశోధన డైరెక్టరేట్ (డీఆర్ఆర్) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐకార్)లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. వ్యవసాయ శాస్త్రానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను 2011లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురసారాన్ని ప్రదానం చేసింది. బోర్లాగ్ అవార్డు (1995), రఫీ అహ్మద్ కిడ్వాయ్ అవార్డులను సైతం ఆయన అందుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. సిద్ధిక్ మృతిపట్ల ప్రొఫెసర్ జయంశకర్ వ్యవసాయవర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ అల్దాస్ జానయ్య, ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డితోపాటు పలువురు శాస్త్రవేత్తలు సంతాపాన్ని తెలియజేశారు.