హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)/కోటపల్లి/ఓదెల : మహాశివరాత్రి పర్వదినం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది పుణ్యస్నానాలకు వెళ్లి మృత్యువాతపడ్డారు. ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలు.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో పుణ్యస్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున 11మంది స్నేహితులు కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లారు. ఈక్రమంలో నది లోతు తెలియకపోవడంతో ఐదుగురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో పడాల దుర్గాప్రసాద్(19), పడాల సాయి(19), తిరుమలశెట్టి పవన్(17), ఏ పవన్(19), జీ ఆకాశ్(19)ఉన్నారు. శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానానికి వెళ్లిన తండ్రీకొడుకు మృతిచెందారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరి మృతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లికి చెందిన రాదం డి రాజేశ్ (50) గోదావరిలో గల్లంతయ్యాడు. శివరాత్రి సందర్భంగా అమ్మవార్ల విగ్రహాలను గోదావరికి తీసుకెళ్తుండగా రాజేశ్ వెళ్లాడు. ఎర్రాయిపేటలో స్నా నం కోసం గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని మల్లికార్జునస్వామి ఆలయానికి వచ్చిన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు కు చెందిన ఒరుసు శ్రీనివాస్ గుండెపోటుకు గురవగా విధుల్లో ఉన్న ఎస్ఐ రమే శ్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.