School Fee | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్, కార్పొరేట్ బడుల్లో ప్రతి రెండేండ్లకోసారి 8% వరకు ఫీజులు పెంచుకోవచ్చు. స్టేట్ లెవల్లో ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఉంటుంది. 8% మించితే స్టేట్ ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించాలి. ఈ కమిటీ అన్ని రకాల విచారణలు జరిపి ఫీజులు ఖరారుచేస్తుంది. ఇవి రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ రూపొందించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలు. ఇలా మరికొన్ని మార్గదర్శకాలు రూపొందించిన విద్యాశాఖ వాటిని త్వరలోనే జరుగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముందు ఉంచనున్నది. ఆ తర్వాత బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు రానున్నది.
రెండేండ్లు గడిచిపాయే..
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించాలని సర్కార్ నిర్ణయించింది. రెండేండ్లయినా ఇది కార్యరూపం దాల్చలేదు. నియంత్రించేందుకు తెలంగాణ విద్యాకమిషన్ ద్వారా అధ్యయనం చేయించింది. విద్యా కమిషన్ పలు సిఫారసులు చేసింది. అంతేకాకుండా తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజీస్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లులను సైతం కమిషన్ సిద్ధం చేసింది. 2025 మార్చిలో సర్కార్కు సమర్పించింది. మూడేండ్లకోసారి ఫీజులు సవరించాలని, రెండేండ్లకోసారి 10-15% ఫీజులు సవరించే అవకాశం ఇవ్వాలని సిఫారసు చేసింది. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఫీజు రెగ్యులేటరీ కమిటీలు ఉండాలన్నది. పాఠశాల విద్యాశాఖ ఆయా ప్రతిపాదనలను కొంత మేర మార్చింది. రెండేండ్లకోసారి ఫీజుల సవరణకు అవకాశం ఇవ్వగా.. పెంపుదలను 8శాతానికే పరిమితం చేసింది. రాష్ట్రస్థాయిలోనే ఎఫ్ఆర్సీని సిఫారసుచేశారు. సంబంధించిన ప్రతిపాదనలు సర్కార్కు చేరాయి. వీటిని రాబోయే క్యాబినెట్ సమావేశం ముందు ఉంచనున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో వచ్చే జూన్ కల్లా ఫీజుల నియంత్రణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడంలేదు.