మహబూబాబాద్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా ఇనుగుర్తి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఎనిమిది బర్రెలు చనిపోయాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులతో కరెంటు వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ సిబ్బందికి గ్రామస్తులు సమాచారం అందించినప్పటికీ వాటిని మరమ్మతులు చేయలేదు.
ఈక్రమంలో గురువారం ఉదయం మేతకు వెళ్లిన బర్రెలకు విద్యుత్ వైర్లు తగిలాయి. ఎనిమిది బర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.