హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : దాదాపు 78 ఏండ్ల వయసున్న బామ్మ డ్రగ్ విక్రేతగా తేలారు. మనుమడితో కలిసి డ్రగ్ విక్రయిస్తున్నట్టు ఈగల్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పోలీసులకు మనుమడు పట్టుబడగా.. బామ్మ తప్పించుకున్నది. ఈ ఘటన బాలానగర్ పరిధిలోని ఫతేనగర్‌లో చోటుచేసుకున్నది. ఈ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఈగల్ ఫోర్స్ సిబ్బంది.. సైబరాబాద్, హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులతో కలిసి మెరుపుదాడి చేశారు.
కాళీవాల అజయ్ అలియాస్ ఆకాశ్ (30) అతని అమ్మమ్మ చంద్రమ్మ (78) ప్రధాన డ్రగ్ విక్రేతలుగా గుర్తించారు. చంద్రమ్మ తన ఇంటి ముందే నిలబడి చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తుండగా పోలీసులు గమనించారు. ఆకాశ్ పట్టుబడగా, 78 ఏండ్ల చంద్రమ్మతో పాటు మరికొందరు డ్రగ్ పెడ్లర్లు పరారయ్యారు. గంజాయి కొనుగోలు చేయడానికి వచ్చిన 31 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 29 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వారంతా 25ఏండ్ల లోపువారే.