ATM | పాల్వంచ, మే 12 : ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టాల్సిన సిబ్బంది దాదాపు రూ.77 లక్షల వరకు దోచుకున్నారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ ఆరా తీయగా అసలు విషయాన్ని బయటపడింది. వరంగల్ జిల్లా హనుమకొండలోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ వారు బ్యాంకుల నుంచి నగదు తీసుకొని ఏటీఎం మెషీన్లలో అమర్చుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం-2 ఇైంక్లెన్కు చెందిన ములుగురి రాజశేఖర్, కొత్తగూడెం గాజులరాజం బస్తీకి చెందిన కందుకూరి సందీప్ ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
వీరు ఆ ఏజెన్సీ ద్వారా కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో డబ్బులు పెడుతుంటారు. ఈక్రమంలో కొత్తగూడెం, పాల్వంచ ఏటీఎంల్లో రూ.76,77,400 నగదు కొరత ఏర్పడినట్టు కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ రాజు ఈ నెల 8న గుర్తించారు. రాజశేఖర్, సందీప్‌లు కంపెనీని మోసం చేసి ఆ మొత్తాన్ని పక్కదారి పట్టించారని గ్రహించారు. కంపెనీ మేనేజర్ జితేందర్ పాల్వంచ పట్టణ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాణాల రాము తెలిపారు.