హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా దేశంలోని మెజార్టీ కుటుంబాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఆదాయాల్లో కోతలు, ఆహారపు కొరత, అప్పులతో అనేక కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఆహార అవసరాల కోసం ముఖ్యంగా పోషకాహారం మీద పెట్టే ఖర్చును తగ్గించుకోవాల్సిన దీనస్థితి చుట్టుముట్టింది. దేశంలో దాదాపు 70 శాతం మందిని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినట్టు హంగర్‌వాచ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ పేరుతో 14 రాష్ర్టాలో రెండు దఫాలుగా సర్వే నిర్వహించినట్టు సంస్థ తెలిపింది. ఈ సర్వే ప్రకారం 66 శాతం మంది ఆదాయాల్లో కోత పడింది. దాదాపు 70 శాతం కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.7 వేల కంటే తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. కరోనా తర్వాత దేశంలో 79 శాతం మంది ఆహార కొరతతో బాధపడుతుండగా, 25 శాతం మంది పూర్తిగా ఆకలితో అలమటిస్తున్నట్టు సర్వే నిర్ధారించింది.
కరోనాకు పూర్వపు రోజులతో పోల్చుకొంటే 41 శాతం మంది ఆహార అవసరాల కోసం పెట్టే ఖర్చును తగ్గించుకొన్నారు. కరోనా కష్టకాలంలో 45 శాతం మంది ఏదోఒక స్థాయిలో అప్పుల పాలు కాగా, 21 శాతం మంది రూ.50 వేలకు అప్పులు చేసినట్టు వెల్లడైంది. కేవలం 34 శాతం మంది వద్ద మాత్రమే సరిపడ ధాన్యం నిల్వలు ఉన్నట్టు పేర్కొన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 4,881 మంది, నగర ప్రాంతాల్లో 1,816 మంది ఈ సర్వేలో పాల్గొన్నట్టు సంస్థ తెలిపింది. 2020లో లాక్డౌన్ ముగిసిన తరువాత ఆరు నెలల పాటు అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టు సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు.