న్యూఢిల్లీ, జూన్ 19: ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై) కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ఉపాధి పొందారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సందర్భంగా 15 లక్షల కొత్త ఉద్యోగాలకు మద్దతుగా రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఆయన పంపిణీ చేశారు. తొలిసారి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సహాయపడటం, అన్ని రంగాల్లో సామాజిక భద్రత పరిధిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని గత ఏడాది ఆగస్టులో ప్రారంభించారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతుగా ప్రోత్సాహకాలుగా మోదీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ. 2,400 కోట్లు బదిలీ చేశారు. దాదాపు 20 లక్షల మంది యువత తమ మొదటి ఉద్యోగంలో ఆరు నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నారని, ఈ మైలురాయిని చేరుకున్న సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులు ఇప్పటికే ఈ పథకం కింద ప్రోత్సాహకాలను పొందారని ప్రధాని తెలిపారు.
తెలంగాణలోనూ..
కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం-వీబీఆర్వై యువతకు ఎంతో మేలు చేస్తుందని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేటలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగి న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మెరుగైన ప్రయోజనాలు, ఆర్థిక వృద్ధిని కల్పించేందుకు తమ ఉద్యోగులను ఈ నిధి లో జమ చేయాలని యజమానులందరినీ కోరారు. ఈ పథకం ముఖ్యంగా తయారీ రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తుందని అన్నారు. ఉద్యోగాల కల్పనలో తమ పాత్ర కు తగిన గుర్తింపు లభిస్తున్నందుకు అటు యాజమాన్యాలు, ఇటు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆర్థికాభివృద్ధి కోసం వారిని ఈ నిధిలో చేర్చడాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, దేశ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు భేషుగ్గా ఉన్నాయని ఎంఎల్సీ కొమరయ్య పేర్కొన్నారు. 350 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో 60 మంది లబ్ధిదారులు, ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ, ఈపీఎఫ్వో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన 10 మంది సభ్యులకు యజమానులు నియామక పత్రాలను అందజేశారు.