హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ కళాశాలల్లో లెక్చరర్ ప్రమోషన్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. ఏడాదిగా ప్రమోషన్లు చేపట్టకపోవడంతో దాదాపు 200 మందికిపైగా నర్సింగ్ ఆఫీసర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తూ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ఈ పదోన్నతులు ఇ వ్వాల్సి ఉండగా.. అధికారుల అలసత్వం కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇదే విషయాన్ని ఇటీవల డీఎంఈ దృష్టికి నర్సింగ్ ఆఫీసర్లు తీసుకెళ్లారు. తమకు న్యా యం చేయాలని డీఎంఈని కోరారు. స్పందించిన డీఎంఈ మర్నాడే సర్క్యులర్ ఇస్తామని హామీ ఇచ్చినా ఈ ప్రక్రియ ముందుకు సాగ డం లేదని నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 560 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇటీవల 93 మందికి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. దీంతో ఖాళీల సంఖ్య 653కు చేరింది.
ప్రమోషన్లు ఇప్పిస్తామని వసూళ్లు..
నర్సింగ్ ఆఫీసర్లకు లెక్చరర్ పోస్టులు ఇప్పిస్తానని చెప్పి డీఎంఈ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళాధికారి గతంలో 100 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు వసూలుచేసినట్టు ఆరోపణలున్నాయి. ఇటీవల 12 మందికి అర్హత లేకున్నా.. ప్రమోషన్లు కల్పిస్తానని చెప్పిన సదరు మహిళాధికారి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నర్సింగ్ ఆఫీసర్లు డీఎంఈని కలిసేందుకు వచ్చారని సమాచారం అందుకున్న సదరు అధికారిణి హుటాహుటిన ఆయన చాంబర్‌కు చేరుకున్నట్టు తెలిసింది. ఫైల్ ఏమైంది అని డీఎంఈ అడగగానే రెడీగా ఉందని ఆ మహిళాధికారి చెప్పినట్టు సమాచారం. అయితే సదరు అధికారి ప్రమోషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చిన 12 మందికి అసలు అర్హతనే లేదని తెలిసింది. ఇదే విషయాన్ని డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్ర మోషన్స్ కమిటీ) తేల్చి చెప్పినట్టు సమాచా రం. ప్యానెల్ ఇయర్ పూర్తయితేనే వారికి ప్రమోషన్లు అర్హత రానుండటంతో ఉద్దేశపూర్వకంగానే అధికారి కాలయాపన చేస్తున్నారని తెలిసింది. మూడు నెలలైతే ప్యానెల్ ఇయర్ పూర్తయి ఆ 12 మందికి కూడా అర్హత వచ్చిన తర్వాత ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని మహిళాధికారి ఎత్తుగడ వేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో కొత్త నర్సింగ్ కాలేజీల భవనాలు పూర్తికాగా కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. ఆ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
బోధనా నాణ్యతపై తీవ్ర ప్రభావం
రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. తగిన సంఖ్యలో బోధనా సిబ్బంది లేకపోవడంతో తరగతుల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లెక్చరర్ల కొరత కారణంగా విద్యార్థుల బోధనా నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రస్తుతానికి గెస్ట్ లెక్చరర్లతో తరగతులు నిర్వహించాల్సి వస్తున్నదని ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని నర్సింగ్ సంఘాలు పేర్కొన్నా యి. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభు త్వ నర్సింగ్ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకులు లేకపోవడం వల్ల క్లినికల్ శిక్షణ సజావుగా సాగడం లేదు. రాష్ట్రంలోని కొన్ని నర్సింగ్ కాలేజీల్లో 20 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా.. కేవలం ఇద్దరు చొప్పున ఉన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని నర్సింగ్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.