హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): టీచర్ కొలువుల భర్తీలో ఈ ఏడాది సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులే అధికంగా భర్తీ కానున్నాయి. 6,500కు పైగా ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. 2 వేల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 600 వరకు భాషాపండితుల పోస్టులు ఉన్నాయి. జిల్లాలవారీగా వివరాలు సేకరించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. సోమవారం ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపనున్నారు. ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 70 శాతం పదోన్నతులు, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. పీడీ, పీఈటీ, డ్రాయింగ్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, ఒకేషనల్ టీచర్ పోస్టులు జిల్లాల వారీగా 10 లోపే ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
ఉద్యోగాల భర్తీలో సెకండరీ ఎడ్యుకేషన్లో 13,086 పోస్టులను భర్తీచేయనున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల్లో పాఠశాల విద్యాశాఖ, మోడల్స్కూల్స్, తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ, పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ, ఎస్సీఈఆర్టీ, గ్రంథాలయాలు వంటివి ఉన్నాయి. 10, 900 పోస్టులు పాఠశాల విద్యాశాఖలోనే ఉన్నట్టు తెలిసింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జిల్లా క్యాడర్ పోస్టులు 10,500కు పైగా, జోనల్ క్యాడర్ పోస్టులు 28, మల్టీజోనల్ క్యాడర్ పోస్టులు 136, ఇతర క్యాడర్ పోస్టులు 51 ఉన్నట్టు సమాచారం.