చెరువు ఎండింది.. కరువొచ్చింది
తెలంగాణ భౌగోళిక స్థితి.. సాగువిధానాలపై కాంగ్రెస్ సర్కార్‌కు అవగాహనా రాహిత్యం.. చెరువులు నింపకపోవడంతో కమ్మిన కరువు.
- ఇప్పటికే 62శాతానికిపైగా చెరువులు ఖాళీ
- బోర్లన్నీ ఫెయిల్.. రైతులకు తప్పని తిప్పలు..
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాకిలి పొక్కిలైతున్నది. సాగునీరు లేక పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నది. వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను నీళ్లతో నింపకుండా ఎండబెట్టింది. వచ్చిన వరదను ఇడిసిపెట్టింది. దీంతో రాష్ట్రమంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి పాలకుల ఏలుబడిలో చూసిన గడ్డుపరిస్థితులను తెలంగాణ నేడు మళ్లీ ఎదుర్కొంటున్నది.
భూమి ఉపరితలానికి దగ్గరలో ఉన్న మట్టి పొరల్లో ఉండే నీటిని కాకుండా లోపల రాతిపొరల్లో ఉంటూ, పారే నీటిని భూగర్భ జలం అంటారు. నేల లోపలి పొరలు, రాళ్ల స్వభావమే భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితులను, రీచార్జీని నిర్దేశిస్తుంటాయి. గట్టి రాతిపొరలు, నేల పొరలు ఉన్న ప్రాంతాల్లో నీరు నిలవడానికి, పారడానికి ఉండే అవకాశాలు తకువ. ఆ భూమిలోకి నీరు ఇంకేందుకు (భూగర్భజలాల రీచార్జి ప్రక్రియ) ఎక్కువ సమయం పడుతుంది. ఇసుక రాతిపొరలు, వదులైన నేలపొరలు ఉన్న ప్రదేశాల్లో భూగర్భజలాల లభ్యత ఎక్కువ. కారణం రీచార్జీ ప్రక్రియ సులభంగా, వేగంగా జరుగుతుంది. తెలంగాణ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే రాష్ట్రంలో 80శాతం గట్టి రాతిపొరలే ఉన్నాయి.
గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఇసుక రాతిపొరలు ఉన్నాయి. దానికి తోడు రాష్ట్రంలో వర్షపాతం కూడా తకువ. కేవలం నాలుగు నెలల పాటే అత్యధికంగా వర్షపాతం ఉంటుంది. మిగిలిన 8 నెలలు డ్రైస్పెల్స్ (వర్షాల ఉండవు) కొనసాగుతాయి. ఇక కుంభవృష్టిగా వర్షాలు కురిసినా భూమిలోకి ఇంకేది మాత్రం 10 శాతానికి మించదని భూగర్భశాస్త్ర నిపుణులు నొక్కిచెప్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో నీటిని ఒడిసిపట్టడంలో, భూగర్భజలాలను పెంచడంలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు తదితర పెర్కొలేషన్ నిర్మాణాలే అత్యంత కీలకపాత్రను పోషిస్తాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే కాకతీయులు వేల సంఖ్యలో చెరువులను నిర్మించారు. నీటి వనరులను ఒడిసిపట్టారు.
ఉమ్మడి పాలకులు ఆ చెరువులను విచ్చిన్నం చేయడంతోపాటు, వ్యవస్థ మొత్తాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతోనే తెలంగాణ పడావుపడ్డది. ఇది చరిత్ర. ఈ వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేయడంతోపాటు, ఆకళింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటగా మిషన్ కాకతీయ చేపట్టి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టారు. ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగానే వాటిని ప్రాజెక్టులతో అనుసంధానించారు. ప్రతి సంవత్సరం చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపట్టారు. ఫలితంగానే రాష్ట్రంలో భూగర్భజల మట్టం పెరుగుతూ వచ్చింది. పంటలకు భరోసా లభించింది.
అక్టోబర్ మొదటివారం నాటికే 62శాతం ఖాళీ
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందునుంచే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కన్నా 18 శాతం తక్కువగా నమోదయింది. కృష్ణా, గోదావరిలో కొద్దిమేరకు జలాలు వచ్చాయి. ఆ జలాలను ఒడిసిపట్టడంలోనూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. వచ్చిన వరదను ఒడిసిపట్టి ప్రాజెక్టులకు అనుసంధానించిన వేలాది చెరువులను నింపుకునే అవకాశాన్ని చేజార్చుకున్నది. నీటిని ఎత్తిపోయడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
దీంతో అక్టోబర్ మొదటి వారం నాటికే చెరువులు అడుగంటాయి. సుదీర్ఘకాలం తరువాత ఉమ్మడి రాష్ట్రంలోని గడ్డు పరిస్థితులను చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 21,500 చెరువుల్లో అక్టోబర్ నాటికి 62 శాతం చెరువుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. ఇక 22 శాతం చెరువుల్లో 50 శాతం నీటి నిల్వలే అందుబాటులో ఉన్నాయి. కొన్ని చెరువుల్లోనే కొద్దిమేర జలాలు ఆశించినస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల నాగర్‌కర్నూల్, సంగారెడ్డి తదితర ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని చెరువులు దాదాపు అడుగంటిపోయాయి. మిగతా ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలో అంతంతమాత్రమే నీటి నిల్వలున్నాయి.
పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్..
ఉమ్మడి పాలకుల తరహాలోనే కాంగ్రెస్ పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. చెరువులను నింపే పక్రియను పూర్తిగా విస్మరించారు. కారణం ఏమంటే నీటికొరత ఉందనేది ప్రభుత్వం నుంచి వస్తున్న జవాబు. అయితే వచ్చిన కొద్దిపాటి వరదనైనా ఒడిసిపట్టి, అందుబాటులో ఉన్న కొద్దిమేర నీటితోనైనా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులను కనీసం 50 శాతం నింపినా కరువు కోరల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి తలెత్తి ఉండేదని కాదని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకోకపోగా.. ఏం చేయాలనేదానిపై తమతో కూడా చర్చించింది లేదని అధికారులు అంటున్నారు. నీరు అందుబాటులో ఉన్న దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కూడా నీటిని లిఫ్ట్ చేయడం లేదు. ఇక్కడ ప్రధానంగా చెరువుల కిందనే బోర్ల వ్యవసాయం సాగుతుంది. ఆ బోరుబావులకు కావాల్సిన భూగర్భజలాల లభ్యతకు మళ్లీ ఆ చెరువులే ప్రధాన భూమికను పోషిస్తూ వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్ అమలుచేసిన బహుముఖ జలసంరక్షణ చర్యల ఫలితంగా బోరుబావుల కింద వ్యవసాయం కూడా పండుగలా మారింది.
దాదాపు 45 లక్షల ఎకరాలు 30లక్షల బోర్లు కిందనే సాగయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రస్తుతం చెరువులను విస్మరించడం మూలంగా మళ్లా బోర్ల కింది సాగు సంక్షోభం దిశగా సాగుతున్నది. చెరువులను నింపకపోవడం వల్లే బోర్లన్నీ ఫెయిలవుతున్నాయని రైతులు వివరిస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి కూడా అదే ప్రధాన కారణమని తెలుస్తున్నది. ప్రభుత్వ అవగాహనరాహిత్యం ఫలితంగానే కరువు దాపురించినట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

