హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మద్యం మార్కెట్లో అడుగుపెట్టేందుకు 92 కంపెనీలకు చెందిన 604 కొత్త బ్రాండ్లు ఉవ్విళ్లూరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తమ బ్రాండ్లను తెలంగాణలో విక్రయిస్తామని ఆ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 331 ఇండియన్ మేడ్ లిక్కర్ బ్రాండ్లు, మరో 273 రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి. దేశ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్ ఈ ఏడాది ఫిబ్రవరి 23న దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. ఆ నోటిఫికేషన్ మేరకు ఇప్పటికే మద్యం సరఫరా చేస్తున్న 45 కంపెనీలు 218 కొత్త రకాల మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణలో తొలిసారి 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు 47 కొత్త కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. లిక్కర్ కంపెనీల నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు తీసుకుంటామని తొలుత స్పష్టం చేసిన టీజీబీసీఎల్.. ఆ తర్వాత ఆ గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. దీంతో ఏప్రిల్ 2 వరకు 92 కంపెనీల నుంచి 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చెవ్వూరి హరికిరణ్ ధ్రువీకరించారు. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వ ఆమోదం మేరకు కొత్త బ్రాండ్లను అనుమతి ఇస్తారు.