హైదరాబాద్/వనపర్తి, జూలై 8 (నమస్తే తెలంగాణ) : నిన్నమొన్నటిదాకా దేశస్థాయిలో వెలుగులీనిన తెలంగాణ పంచాయతీలు ఇప్పుడు కళతప్పాయి. ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న గాంధీజీ స్ఫూర్తితో కేసీఆర్ తొమ్మిదేండ్ల పాటు ఎంతో కృషి చేసి అభివృద్ధి చేసిన గ్రామాలు నేడు జీవం కోల్పోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలలుగా ఖాతాల్లో పైసా లేక జీపీలు కునారిల్లుతున్నాయి. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం మూడు వేల కోట్ల బకాయి పడింది. ఆర్థిక సంఘం ద్వారా ప్రతినెల దాదాపు రూ.400 కోట్లు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉండగా వాటిని నిలిపివేసింది. వందలాది జీపీల ఖాతాల్లో 20-30 వేలలోపే డబ్బుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. అభివృద్ధి మాట పక్కనబెడితే కనీసం కార్మికుల జీతాలు, ట్రాక్టర్ల నిర్వహణకు కూడా దిక్కులు చూడాల్సిన దుస్థితి దాపురించింది. పారిశుద్ధ్య నిర్వహణ భారంగా మారి, పల్లెలకు మళ్లీ పాతరోజులు వచ్చాయి. పేరుకుపోతున్న చెత్త, మురుగుతో ముక్కుపుటాలు అదురుతుండగా వానకాలం కావడంతో వ్యాధులు బుసకొడుతున్నాయి.
నాడు అవార్డులు.. నేడు తారుమారు
ఒక నాడు జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్న పల్లెలు, పట్టణాల్లో ఏడు నెలల్లోనే పరిస్థితి అంతా తారుమారైంది. ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుల బతుకులు భారంగా మారాయి. జీతాలు రాకుంటే పని ఎందుకు చేయాలని చాలామంది మానేసి రోజుకూలీలకు వెళ్తుండడం కనిపిస్తున్నది. గ్రామ చిన్న చిన్న అవసరాలకు కార్యదర్శులు అప్పులు చేసి కష్టాలపాలవుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నా, మురుగు కాల్వలు, నీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నా డబ్బులు లేని దుస్థితికి పంచాయతీలు చేరుకున్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కింద గత ప్రభుత్వం పట్టణాలకు నెలకు రూ.148 కోట్లు, పంచాయతీలకు నెలకు రూ.230 కోట్లు ఇచ్చేది. కేంద్రం ఇచ్చే నిధులతో సమానంగా నిధులు విడుదల చేసేది. దీంతో తెలంగాణ పంచాయతీలు అభివృద్ధికి చిరునామాగా మారి జాతీయ స్థాయి అవార్డులు సైతం అందుకున్నాయి. కాంగ్రెస్ వచ్చాక పల్లె, పట్టణ ప్రగతికి మొత్తానికే మంగళం పాడింది. బీఆర్ఎస్ హయాంలో ఊరూరికీ పారిశుద్ధ్య నిర్వహణ కోసం సమకూర్చిన ట్రాక్టర్లు ఇప్పుడు కనీసం డీజిల్ కూడా పోసే దిక్కులేక మూలకుపడ్డాయి. ట్రాక్టర్లు పనిచేయక, కార్మికుల జీతాలందక చెత్త సేకరించే నాథుడు లేక గ్రామాలు, పట్టణాలు కంపుకొడుతున్నాయి. అసలే వానకాలం కావడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
కార్యదర్శులూ అప్పులపాలు
పంచాయతీల్లో పన్నుల రూపంలో వసూలయ్యే జనరల్ ఫండ్‌ను కరెంటు బిల్లులకు చెల్లించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంతో ఆ నిధులు వాటికే సరిపోతున్నాయని స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారిందని చెబుతున్నారు.పనులకు బిల్లులు రాక అప్పుల పాలయ్యామని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఫాగింగ్, బ్లీచింగ్‌కు కూడా డబ్బుల్లేవని అన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాక తాగునీరు, పారిశుధ్యం, మొక్కలు, వీధిదీపాల నిర్వహణ, మరమ్మతులు చేపట్టలేకపోతున్నామని చెబుతున్నారు. ఏవైనా సమస్యలు పరిష్కారం కాకుంటే తమకు మెమోలు జారీ చేస్తున్నారని, నిధుల గురించి మాత్రం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
అభివృద్ధి పనులకు బ్రేక్
పల్లె, పట్టణ ప్రగతి కింది చేపట్టిన వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్‌వెజ్ మార్కెట్లు, ఎఫ్ఎస్టీపీలు, మోడ్రన్ దోభీఘాట్లకు నిధులు రాక ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన నిర్మాణాలు నిలిచిపోయాయి. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు.
ప్రభుత్వం కన్నెత్తిచూడడం లేదు
పంచాయతీలకు నిధులు రాక ఏడు నెలలైంది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం పట్టించుకుంట లేదు. కార్యదర్శులు జేబుల్లోంచి పెట్టలేక ఇబ్బంది పడుతున్నరు. ప్రజాప్రభుత్వంలో పాలకవర్గాలు, ప్రజాప్రతినిధి లేకుంటే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతయ్? పల్లెల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ లేదు. ఫాగింగ్ చేసేందుకూ నిధుల్లేవు. ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడడం లేదు.
– సుర్వి యాదయ్య గౌడ్, మాజీ సర్పంచ్, తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
ద్వారకానగర్ జీపీ ఖాతాలో మూడు వేలు
వనపర్తి జిల్లా మదనాపురం మండలం ద్వారకానగర్‌లో పని చేసే ఇద్దరు కార్మికులకు 8 నెలలుగా జీతాలు రాలేదు. జీపీ ఖాతాలో కేవలం రూ.3 వేలు మాత్రమే ఉండటంతో కార్యదర్శి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు.
ఖాతాలో 40వేలు.. కట్టాల్సినవి 12లక్షలు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో 11 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేవారు. అంతకుముందు సక్రమంగా వచ్చిన జీతాలు ఇప్పుడు రాకపోవడంతో నాలుగు నెలల కిందట ఐదుగురు కార్మికులు మానేశారు. ‘జీతాలు రాని పని మాకొద్దు’ అంటూ చంద్రకళ, జానమ్మ, సత్యమ్మ, రాజు, రాములు స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఇక జీపీలో రూ.40 వేలుంటే చేపట్టిన పనులకు రూ.12 లక్షలు చెల్లించాల్సి ఉన్నది.
జీతం రాక మానేసిన..
నెలల తరబడి జీతం ఇవ్వకుంటే మాలాంటి చిన్న కుటుంబాలు ఎట్ల గడుస్తయి?. వేలకు వేలు జీతాలు తీసుకునేటోళ్లే ఒకటో తారీఖున రాకుంటే లబోదిబోమంటరు. రెండు వేల జీతం మొదలు 10 ఏండ్లకుపైగా జీపీలో పనిచేసిన. ఇంతకుముందు ఓ నెల కాకపోయినా మరో నెల జీతం వచ్చేది. ఇంట్లో పూట గడవకనే మూడు నెలల కిందట ఐదుగురం పని మానేసినం.
– రాములు, పని మానేసిన కార్మికుడు, పెద్దమందడి