మహబూబాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి సమీపంలోని సోమ్లాతండాకు చెందిన యువ దంపతులు భుక్యా దేవేందర్, ఉమారాణి డిగ్రీ పూర్తిచేశారు. ఉద్యోగాల కోసం చూడకుండా తమకు తెలిసిన వ్యవసాయాన్నే నమ్ముకొన్నారు. గతంలో వరి వేసినా, లాభం లేకపోవటంతో పొలాన్ని చిదగొట్టి రెండేండ్ల నుంచి కూరగాయల సాగుపై దృష్టిపెట్టారు. 20 గుంటల్లో బెండ, 30 గుంటల్లో కాకర, 10 గుంటల్లో బీర, 10 గుంటల్లో వంకాయ, మరో 10 గుంటల భూమిలో సొరకాయ సాగు చేస్తున్నారు. వరితో లాభాలు రాలేదని, కూరగాయల సాగుతో మంచి లాభాలు వస్తున్నాయని చెప్పారు. గతంలో పొలానికి అధిక పెట్టుబడి పెట్టేవాళ్లమని, లాభం కూడా లేకపోగా, కష్టం అంతా వృథా అయ్యేదని తెలిపారు.
కూరగాయల తోట.. లాభాల బాట
కూరగాయల సాగుతో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. ఒక ఎకరాలో బెండకాయలు సాగు చేస్తే విత్తనం, ఎరువులు, పురుగుల మందులు, కలుపు తీయడానికి, కాయలు తెంపడానికి మొత్తం రూ.35,700 పెట్టుబడి అవుతుంది. ఒక ఎకరాలో వేసిన బెండ 38 రోజుల నుంచి 40 రోజుల మధ్య కోతకు వస్తుంది. అప్పటి నుంచి ప్రతి మూడు నాలుగు రోజులకు తెంపవచ్చు. దిగుబడి 10 టన్నుల దాకా వస్తుంది. మార్కెట్లో కిలో బెండకాయలు రూ.12 చొప్పున అమ్మితే రూ.96 వేల ఆదాయం వస్తుంది. అంటే.. పెట్టుబడి రూ.35,700 పోగా, రూ.60,300 ఆదాయం వస్తుంది. బీరకాయ సాగుతోనూ రైతులకు లాభాలు వస్తున్నాయి. ఇది మూడు నెలల పంట. విత్తనం, భూమిని దున్నడం, ఎరువులు, పురుగుల మందులు, కూలీలు, రవాణా ఖర్చులు అన్నీ కలిపి రూ.40 వేలు అవుతుంది. ఒక ఎకరాకు 12 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. కిలోకు రూ.60 చొప్పున అమ్ముడు పోతున్నాయి. బెండ, బీరకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్నది.
కూరగాయల సాగే ఉత్తమం
విత్తనాలు నాటడం, కలుపుతీయడం, ఎరువులు చల్లడం, పురుగుల మందులు పిచికారీ చేయడం, కాయలు తెంపడం అన్ని మేమే చేస్తాం. మా తోటల వద్దకు ప్రజలు, చిరువ్యాపారులు నేరుగా వచ్చి కొనుక్కొని వెళ్తారు. మహబూబాబాద్ మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముతాం. అన్ని ఖర్చులు పోగా ఏడాదికి రూ.5 నుంచి రూ.6 లక్షల ఆదాయం వస్తున్నది. వరి కంటే కూరగాయల సాగే ఉత్తమం.