హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి కారణంగా వాయిదా వేసిన జీతాలు, పెన్షన్లకు 6% వడ్డీ చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు 50% చెల్లింపులను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 27కు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కరోనా విజృంభణ సమయంలో ఏపీ ప్రభుత్వం వాయిదా వేసిన జీతాలు, పెన్షన్లపై 6% వడ్డీ చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలోనూ 6% వడ్డీ చెల్లించాలని హైకోర్టు ఆదేశించి విచారణను ముగించింది.