నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జులై 6 (నమస్తే తెలంగాణ): సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో 500 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. సోమవారం విచారణ సందర్భంగా 23 మంది నిందితుల్లో 20 మంది హాజరయ్యారు. అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరి తరఫున న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్లు సమర్పించడంతో వాటిని అంగీకరించిన తర్వాత విచారణ పూర్తిచేసింది. హాజరైన నిందితులందరికీ 500 పేజీల చార్జిషీట్‌ను కోర్టు అందించింది.
వచ్చే వాయిదాకు నిందితులంతా కోర్టుకు హాజరుకావాలని, కమిటల్ బాండ్ వేయాలని నిందితుల తరఫు న్యాయవాదులకు సూచించింది. షూటింగ్ ఉండడంతో అల్లు అర్జున్ ముంబయి వెళ్లారని, భారీ వర్షాల వల్ల రాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. దాంతో వర్చువల్‌గా హాజరయ్యేందుకు వరుసగా రెండోసారి అల్లు అర్జున్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణకు కోర్టుకు సహకరించాలని సూచించింది. నిందితులంతా హాజరైతేనే కమిటల్ బాండ్ పిటిషన్లను కోర్టు అంగీకరిస్తుందని పేర్కొంది. ఈ నెల 29కి విచారణ వాయిదా వేసింది.