Congress Guarantee | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆరు నెలలుగా లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ డబ్బులు జమకావడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు.. గ్యాస్ ఏజెన్సీలు, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అధికారులను అడిగితే తమకేమీ తెలియదని చెప్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 27న రూ.500కే సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టింది. తెల్ల రేషన్‌కార్డులు ఉన్నవారందరికీ వర్తింపజేస్తామని ఘనంగా ప్రకటించింది. మహిళల పేరిట ఉన్న కనెక్షన్లకు మాత్రమే పథకం వర్తిస్తుందని చెప్పడంతో సుమారు 58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నిబంధల పేరిట సుమారు 13.9 లక్షల మందిని తొలగించి 44.1 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. తొలుత రెండు, మూడు నెలలపాటు ఆయిల్ కంపెనీలకు రాయితీ డబ్బులు ఇస్తామని, తర్వాత నేరుగా అబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పారు. ఆరేడు నెలలపాటు సక్రమంగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాయితీ డబ్బులను జమచేశారు. అయితే, గత సంవత్సరం నవంబర్ నుంచి గ్యాస్ సబ్సిడీ నగదు అందడంలేదని మహిళలు వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటుండటం, సబ్సిడీ గ్యాస్ స్కీం నిలిచిపోవడంతో పలువురు గ్రామీణ మహిళలు గ్యాస్ సిలిండర్‌ను అటకెక్కిస్తున్నారు. వంట కోసం కట్టెల పొయ్యిపై ఆధారపడుతున్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రూ.500కే సిలిండర్ ఇస్తామని అబద్ధాలు చెప్పిందని మండిపడుతున్నారు. గద్దెనెక్కిన తర్వాత ఖజానాలో డబ్బులు లేవని చెప్పి తప్పించుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని చెప్తే మస్తు సంతోషపడ్డం. ఈ ఏడాదిలో నాలుగు సిలిండర్లు తీసుకున్నం. కానీ, మొదటిసారి మాత్రమే సబ్సిడీ కింద రూ.300 మా ఖాతాలో జమైనయ్. ఆ తరువాత పడలేదు. మండల కేంద్రంలో ఉన్న గ్యాస్ ఆఫీసుకు పోయి అడిగితే మండలాఫీసుకు వెళ్లమన్నరు. అక్కడికి పోయి అడిగితే మాకు తెల్వదు అంటున్నరు. ప్రభుత్వం గిట్ల జేయడం మంచిపద్ధతి కాదు. ఇచ్చిన మాట ప్రకారం రూ.500కే సిలిండర్ ఇవ్వాలె.
ఎన్నికల టైంలో మా పార్టీకి ఓటేస్తే రూ.500కే సిలిండర్ వస్తుందని కాంగ్రెస్ నాయకులు నమ్మబలికిన్రు. మొదట్ల్లో రెండు, మూడు సిలిండర్లు తీసుకున్నప్పుడు ఖాతాలో రూ.300 చొప్పున జమయినయ్. కానీ, ఆరేడు నెలల సంధి ఒక్క రూపాయి కూడా పడతలేవు. నాకే గాదు మా ఊర్లో చాలామందికి సబ్సిడీ పైసలు పడతలేవు అంటున్నరు. బ్యాంకులు, ఆఫీసులకెళ్లి అడిగితే మాకు తెల్వదని చెప్తున్నరు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు పథకాన్ని అమలుచేయాలి. మమ్మల్ని మోసం చేస్తే మళ్లా ఓట్ల టైంలో మా తడాఖా చూపెడుతం.