హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అధిక వడ్డీ ఆశచూపి 3,500 మంది నుంచి రూ.50 కోట్లు వసూలుచేసి మోసగించిన మెటాలాయిడ్స్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ జయంత్ బిశ్వాస్‌ను గురువారం సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం, రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన జయంత్ బిశ్వాస్ 2016లో మెటాలాయిడ్స్ పేరుతో ఓ స్టార్టప్ సంస్థను స్థాపించాడు. అది త్వరగానే క్లిక్ అయింది. కానీ, వచ్చిన ఆర్డర్లను డెలివరీ చేసేందుకు నగదు లేకపోవడంతో జయంత్ బిశ్వాస్ మెటాలాయిడ్స్ సస్టెనాన్స్ పోర్ట్‌పోలియో పేరుతో మరో సంస్థను నెలకొల్పాడు. తన వ్యాపారంలో డబ్బులు పెడితే 10 రోజులకే వడ్డీ వస్తుందని ప్రచారం చేశాడు. చాలామంది దీనికి ఆకర్షితులై పెట్టుబడి పెట్టారు. ఇలా తెలంగాణలో 3,500 మంది నుంచి రూ.50 కోట్ల వరకు వసూలుచేశాడు. దేశవ్యాప్తంగా దాదాపు రూ.80 కోట్లకుపైగా వసూలు చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులపాటు కొంత మందికి సక్రమంగా వడ్డీ ఇచ్చినా ఆ తర్వాత ఇవ్వలేకపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై మాదాపూర్, రాయదుర్గం, రామచంద్రాపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల జయంత్ బిశ్వాస్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఖాతాల్లో ఉన్న రూ.8 కోట్లను జప్తు చేశారు. ఈ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న అతడి భార్య మౌషుమి బిశ్వాస్ పరారీలో ఉన్నది.