హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : దేశంలోని మరే రాష్ట్రంలో ఐదు డీఏలు పెండింగ్‌లో లేవని, ఒక్క తెలంగాణలో మాత్రమే ఇన్ని డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని టీజీవో అసహనం వ్యక్తంచేసింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం గర్హనీయమని పేర్కొన్నది. టీజీవో విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాన్ని శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. టీజీవో అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తక్షణమే రెండు డీఏలు విడుదల చేసి, మరో రెండు డీఏలను పీఆర్సీలో కలపాలని డిమాండ్ చేశారు.
450కి పైగా డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని, తమ సమస్యలను సీఎంకు చెప్పినా సీఎస్‌కు చెప్పినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడంలేదని అసహనం వ్యక్తంచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన 8వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయని పేర్కొన్నారు. సీఎం హామీ ఇచ్చినా ఇంత వరకు పెండింగ్ బిల్లులు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొందరు అధికారులు కావాలని బదిలీలు చేపట్టడంలేదని వాపోయారు. ఈ విషయమై 70-80 సార్లు అధికారుల చుట్టూ తిరిగామని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో టీజీవో అసోసియేట్ అధ్యక్షుడు బీ శ్యామ్, ఉపాధ్యక్షుడు మాచర్ల రామకృష్ణాగౌడ్, బీ సహదేవ్, జగన్మోహన్రావు, కోశాధికారి ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.