హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తేతెలంగాణ): మహాత్మాజ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 4091 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 157, విద్యుత్ శాఖకు 105, రెవెన్యూ శాఖకు 30 అర్జీలు అందాయని పేర్కొన్నారు. కాగా ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఏకంగా 2865 అర్జీలు రాగా, రేషన్‌కార్డుల కోసం 1640, ఇతర శాఖలకు సంబంధించి 109 వచ్చాయని వెల్లడించారు.
ఇండ్లు, రేషన్ కార్డుల కోసం భారీగా..
ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా ఇండ్లు, రేషన్ కార్డుల కోసం వచ్చాయి. అయితే ప్రభుత్వం గత జనవరి 21, 22, 23 తేదీల్లో గ్రామ, వార్డు సభలను నిర్వహించి అర్హుల జాబితాను ప్రకటించడంతోపాటు కొత్తగా దరఖాస్తులు స్వీకరించింది. అయినా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం భారీగా 4505 అర్జీలు రావడం గమనార్హం.