హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొల్లంకు 44 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఈ రైళ్లు నడవనున్నట్టు తెలిపింది. వీటిలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. విశాఖ నుంచి వెళ్లే రైళ్లు దువ్వాడ నుంచి కంయంకుళం వరకు 26, శ్రీకాకుళం నుంచి వెళ్లే రైళ్లు పొందూరు నుంచి 32 స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించింది. శబరిమల వెళ్లే భక్తులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
రవాణాశాఖలో పదోన్నతులు ; జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లుగా మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తేతెలంగాణ): రవాణాశాఖలో ఖాళీగా ఉన్న డీటీసీ, జేటీసీ పదోన్నతులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ నేతృత్వంలోని డిపార్టమెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. రంగారెడ్డి డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, మహబూబ్‌నగర్ డీటీసీ శివ లింగయ్యకు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతి కల్పించారు. ఉప్పల్ ఆర్టీవో వాణి, ఖమ్మం ఆర్టీవో ఆఫ్రిన్, మెహదీపట్నం ఆర్టీవో కిషన్, కొత్తగూడెం ఆర్టీవో సదానందం, నాగోల్ ఆర్టీవో రవీందర్ కుమార్‌గౌడ్, సూర్యాపేట ఆర్టీవో సురేష్‌రెడ్డికి డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. పదోన్నతులకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. పదోన్నతులకు ఆమోదం తెలపడంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, రవాణాశాఖ కమిషనర్‌కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.