సంగెం, జనవరి 30 : మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది.. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా సంగెంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 420 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగకూడదని, రైతులకు భరోసా కల్పించేందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. సంగెం మండలం పల్లార్గూడ మహారాజ్తండాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బానోత్ తిరుపతి కుటుంబాన్ని కమిటీ సభ్యులు, మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో రద్దు చేయించారని మండిపడ్డారు.
ఈ పర్యటన జరిగితే కాంగ్రెస్ కనుమరుగవుతుందని భయపడి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. రైతు బీమా, రైతుబంధు, అందు బాటులో ఎరువులు, విత్తనాలు, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి పండిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని గుర్తుచేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న రేవంత్‌రెడ్డి ఆనవాళ్లే లేకుండా అయ్యే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయని చెప్పారు. పల్లార్గూడలో జరిగే సమావేశాన్ని కోర్టు అనుమతితో ఫిబ్రవరి 1న నిర్వహించుకుంటామని తెలిపారు.