హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ తొలి నుంచి కోరుతున్నదని స్పష్టంచేశారు. ఆర్డినెన్స్‌లు, జీవోల ద్వారా వచ్చే రిజర్వేషన్లను తాము కోరుకోలేదని తేల్చిచెప్పారు. ఒకవేళ జీవోల ద్వారా బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పాలకులకు 20 నెలల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించే 42 శాతం రిజర్వేషన్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలన్నదే తమ పార్టీ అభిమతమని చెప్పారు.
బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేశపెట్టిన రెండు బీసీ బిల్లులకు తాము సంపూర్ణగా సహకరించామన్న సంగతిని గుర్తుచేశారు. ఆ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను ఎందుకు మరిచారని సీఎం రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ ఆర్డినెన్స్, జీవోలతో బీసీ రిజర్వేషన్ల అమలుసులభమైతే.. ఇతర రాష్ర్టాలు కూడా ఇదే విధానం అమలు చేసేవి కదా? అన్న సందేహాన్ని వ్యక్తంచేశారు.
రెండు బీసీ బిల్లుల ఆమోదం కోసం బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా సహకరించిందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పాలకులు గుర్తెరగాలని శ్రీనివాస్‌గౌడ్ హితవు పలికారు. రాజ్యాంగబద్ధంగా కాకుండా కోర్టుల్లో నిలవని ఆర్డినెన్స్, జీవోల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చి, దానికి సహకరించాలంటూ ప్రతిపక్ష పార్టీలను ప్రాధేయ పడడమేమిటని సర్కారును నిలదీశారు. ఈ ప్రాధేయపడటం వెనుకాల ఏదో మతలబు ఉండే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేత కే కేశవరావు మాట్లాడిన విషయాలు అస్సలు అర్థంకాలేదని చెప్పారు.
బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన బాగానే ఉన్నారని, కాంగ్రెస్‌లోకి వెళ్లాకే ఏమైందో తెలియడం లేదని పేర్కొన్నారు. కేశవరావుకు ఏదైనా జరిగితే అందుకు పూర్తిబాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరమే లేదని ఆయన ఎలా అంటారని ప్రశ్నించారు. అనేక రాష్ర్టాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి కేశవరావుకు తెలియదా? అని ప్రశ్నించారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పాలకులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
బీసీలకు రిజర్వేషన్ల అమలు విధి విధానాల విషయంలో బీఆర్ఎస్ న్యాయ నిపుణులు సలహాలు, తీసుకున్నాకే మాట్లాడుందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జీవోల ద్వారా రిజర్వేషన్లు సాధ్యంకాదని తామంటుంటే.. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. తాము నిజాలు మా ట్లాడుతుంటే.. కాంగ్రెస్ వాళ్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో రెండు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించినప్పుడే ఆర్డినెన్స్ ఎందుకు తేలేదని నిలదీశారు.
బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కారు తీసుకొస్తున్న ఆర్డినెన్స్ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. బీసీ బిల్లులు ప్రస్తుతం ఎక్కడున్నాయి? వాటి ఆమోదానికి బీజేపీ నేతలు తీసుకున్న చొరవ ఏమిటి? అన్న విషయాలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చారని, వాటి అమలు ఏమైందో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దామాషా ప్రకారం బీసీలకు ఇస్తామన్న పదవులు ఎందుకు ఇవ్వడం లేదని, ప్రస్తుతం మంత్రివర్గంలో మూడు పదవులు బీసీల కోసం ఉన్నాయని, వాటిని బీసీలతోనే భర్తీచేయాలని శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నేతలు సదానందంగౌడ్, కురవ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ సర్కార్.. విద్యా, ఉద్యోగాల్లో కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకోసం ఆర్డినెన్స్, జీవో ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, బీఈడీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ తదితర కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్నదని, ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం 42 శాతం బీసీ రిజర్వేషన్లు పాటించాలి కదా? నిలదీశారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు.