హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రూ.409.50 కోట్లు విడుదల చేసింది.15వ ఆర్థికసంఘం సిఫారసుల మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి తొలి విడత గ్రాంట్ రూపంలో ఈ నిధులు విడుదలయ్యాయి. కేంద్ర ఆర్థికశాఖ దేశంలోని 25 రాష్ర్టాలకు మొత్తం రూ.13,385.70 కోట్లను విడుదలచేసింది. వీటిని ప్రధానంగా పారిశుద్ధ్యం, బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత ప్రాంతాలుగా మార్చడానికి, గ్రామీణ ప్రజలకు తాగునీటిని అందించడానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం రూ.682.50 కోట్లు ఇచ్చింది.