హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా అన్ని టెలికం మోసాల్లో సిమ్ సబ్స్క్రిప్షన్ మోసాలు 35-40 శాతం వరకు ఉన్నాయని, వాటివల్ల టెలి కం రంగానికి ఏటా రూ.3 కోట్ల కోట్లు నష్టం వాటిల్లుతున్నదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యయనం తెలిపింది. సీఎస్బీ, ఐఎస్బీ, డాటా సైన్స్ ఇన్స్టిట్యూట్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సంయుక్తంగా చేపట్టిన ‘టెలికం సిమ్ సబ్స్రిప్షన్ ఫ్రాడ్స్: గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్ అసెస్మెంట్స్ అండ్ రికమెండేషన్స్’ అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగు చూశాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు.
ఈ నివేదికను ఐఎస్బీ ప్రొఫెసర్ మనీశ్ గంగ్వార్, డాక్టర్ శృతి మంత్రి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాటా సైన్స్ (ఐఐడీఎస్), తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ సీపీ కలమేశ్వర్ శింగేనవర్, ఏసీబీ జా యింట్ డైరెక్టర్ రితిరాజ్ నేతృత్వంలో సంయుక్తంగా రూపొందించారు. సిమ్‌కార్డు రిజిస్ట్రేషన్‌లో కేవైసీ కోసం 64.5 శాతం మంది వినియోగదారులు ఆధార్‌ను ఉపయోగిస్తున్నారని అయితే, వారు ఉపయోగించే ప్రత్యామ్నాయ నంబర్లలో 89 శాతం ఆధార్‌కు లింక్ చేయటం లేదని, దీంతో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధ్యయనం గుర్తించింది.
చినజీయర్‌స్వామి ‘ప్రజ్ఞావికాస్’ పోటీలు
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : చినజీయర్ స్వామి ప్రజ్ఞా వికాస్ ద్వారా ‘మాతృభూమికి కృతజ్ఞత, సీమ సంరక్షణ దళాలకు కృతజ్ఞత, స్వాతంత్య్ర సమరయోధులకు కృతజ్ఞత’ పై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్టు ప్రజ్ఞా టీమ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడం కోసం ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలవారీగా ఈ నెల 31లోపు పోటీలు నిర్వహించి ఇద్దరిని ఎంపిక చేయాలి. ఎంపికైన విద్యార్థులకు ఆగస్టు 2, 3 తేదీల్లో జిల్లా పరిధిలో పోటీలు నిర్వహించాలి. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు చినజీయర్‌స్వామి ఆగస్టు 7న బహుమతులు ప్రదానం చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులకు ఆగస్టు 7న ముచ్చింతల్‌లోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో మొదటి బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు అందజేస్తారు.