కాగజ్‌నగర్, సెప్టెంబర్ 19: ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివసిస్తూనే రూ.40 లక్షల మేర హౌజ్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ)ను కాజేసిన 18 మంది మైనార్టీ గురుకుల ఉద్యోగుల నుంచి తిరిగి వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని రెండు మైనార్టీ గురుకులాల్లో విధులు నిర్వర్తించే పలువురు ఉద్యోగులు 2016 నుంచి 2021 వరకు ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివసించారు.
అయితే 18 మంది అక్రమంగా హెచ్ఆర్ఏ పొందినట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 18 మంది రూ.40 లక్షల మేర హెచ్ఆర్ఏను స్వాహా చేసినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా మైనార్టీ అధికారికి ఆదేశాలు అందాయి. 15 రోజుల కింద ఆదేశాలు జారీ కాగా, నాలుగు రోజుల కింద విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.