న్యూఢిల్లీ, మే 12 (నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి ఆస్తుల విభజన ఆలస్యం కావడంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సుందరేషన్ ధర్మసనం విచారించింది. రూ.లక్షన్నర కోట్లకుపైగా విలువైన ఆస్తుల విభజనను తెలంగాణ ఆలస్యం చేస్తున్నదని ఆరోపించింది. ఈ ఆస్తుల విభజనకు అవసరమైతే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిటీ నియమించాలని ఏపీ కోరింది. దీనిపై అభిప్రాయం తెలపాలని సుప్రీంకోర్టు కోరడంతో.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, పరిశీలిస్తామని కేంద్రం, తెలంగాణ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఏపీ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు 4 వారాల సమయాన్ని ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై నెలాఖరుకు వాయిదా వేసింది.