KTR | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా భద్రత ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై ఇటీవల వరుసగా జరుగుతున్న లైంగికదాడి ఘటనలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని ఆయన గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గత 48 గంటల్లోనే నాలుగు లైంగికదాడి ఘటనలు వెలుగుచూడటం బాధాకరమని పేర్కొన్నారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆయా ఘటనల్లో బాధితులకు వేగంగా న్యాయం అందించాలని కేటీఆర్ కోరారు. ఇలాంటి ఘటనలు మహిళా భద్రతను ప్రమాదంలో పడేయడంతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణపై సందేహాలను లేవనెత్తుతున్నాయని చెప్పారు. ఎనిమిది నెలలైనా రాష్ర్టానికి హోంశాఖ మంత్రి లేకపోవడం వల్లే నేరాల సంఖ్య పెరుగుతున్నదని ధ్వజమెత్తారు.