మెట్పల్లి రూరల్, జనవరి 4: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ రైతులందరూ సామూహికంగా ఒకేరోజు 4.19 లక్షల వ్యవసాయ విద్యుత్తు సర్వీస్ చార్జీలు చెల్లించారు. ఈ గ్రామ రైతులు ఎనిమిదేండ్లుగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులో ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువారం స్థాని క ట్రాన్స్ఫార్మర్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ప్రత్యేక సమావేశమై వ్యవసాయ పంపుసెట్ల సర్వీస్ చార్జీలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2023 సంవత్సరానికి 360 చొ ప్పున 1,165 పంపుసెట్ల విద్యుత్తు సర్వీస్ చార్జి కింద 4,19,400 చెల్లించాలని తీర్మానించారు. ట్రాన్స్‌కో ఎస్ఈ సత్యనారాయణ, డీఈ తిరుపతి, ఏడీ మనోహర్ ఆధ్వర్యంలో రూరల్ ఏఈ నవీన్‌కు ఆ మొత్తాన్ని చెల్లించారు. ఒకే దఫాలో సర్వీస్ చార్జీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్‌కో అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సీతారాం, లైన్మెన్ శ్రీధర్, జేఎల్ఎంలు శివ, జలపతి పాల్గొన్నారు.